భవిష్యత్తులో నీటిని కిరాణా దుకాణాల్లో అమ్ముతారు. ఇది వందేళ్లనాటి మాట. అప్పట్లోనే జైనమత సన్యాసి బుద్ధిసాగర్ భవిష్యత్తును దర్శిస్తూ ఈ మాట చెప్పారు. ప్రస్తుతం మనం నిజంగానే ఇంటికి చేరువలో ఉండే దుకాణాల నుంచే శుద్ధజలం పేరిట నీటి డబ్బాలను కొని తెచ్చుకుంటున్నాం. ఎందుకీ పరిస్థితి! ఇళ్లకు సరఫరా చేసే నల్లానీరు పరిశుభ్రంగా ఉండటం లేదనే అనుమానాలు ఉండటమే ఇందుకు కారణం. కుళాయిల్లో తరచూ మురికి నీరు రావడమనేది దేశ ప్రజలందరికీ అనుభవమే. కేంద్రమంత్రికి సైతం ఇలాంటి అనుభవమే ఎదురైతే! ఇటీవల దేశ రాజధాని దిల్లీలో కుళాయిల ద్వారా అందే తాగునీరు ఎంత శుభ్రంగా ఉంటోందో పరీక్షించారు. ఇందుకోసం పలు నివాసిత ప్రాంతాల నుంచి 11 నీటి నమూనాల్ని సేకరించారు. ‘10-జనపథ్’లోని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్ పాసవాన్ ఇల్లు, కృషిభవన్‌లోని ఆయన కార్యాలయం నుంచీ నమూనాల్ని తీసుకున్నారు. 19 పరామితులపై నిర్దేశించిన ప్రమాణాల్ని చేరుకోవడంలో ఇవి విఫలమయ్యాయి. కరిగిన ఘనపదార్థాలు, మలినాలు, కఠినత్వం, క్షారగుణం, ఖనిజాలు, లోహ పదార్థాలు, కోలిఫాం, ఈకొలి సూక్ష్మజీవుల ఆనవాళ్లు వంటి పరామితుల విషయంలో నీటి నమూనాలు ప్రమాణాల్ని అందుకోలేకపోయాయి. చివరికిది రాజకీయ దుమారానికి దారితీసింది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ‘మా ప్రభుత్వానికే వంకపెడతారా’ అని మండిపడటం, అపరిశుభ్రతను నిరూపించాలంటూ సవాలు విసరడం వంటి పరిణామాలన్నీ వేగంగా జరిగిపోయాయి. ప్రజలందరికీ శుభ్రమైన తాగునీరు అందించేలా రాష్ట్ర ప్రభుత్వాల్ని ప్రోత్సహించేందుకే ఆ అధ్యయనం చేపట్టినట్లు స్పష్టం చేసిన పాసవాన్- వివాదాన్ని చల్లార్చేందుకు యత్నించారు. దేశంలోని నగరాల్లో సరఫరా చేసే నల్లా నీరు కచ్చితంగా భారత ప్రమాణాల బ్యూరో(బీఐఎస్) నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు తగినట్లుగా ఉండేలా చర్యలు తీసుకుంటామని పాసవాన్ హామీ ఇచ్చారు. అన్ని నీటి సరఫరా సంస్థలకూ బీఐఎస్ నిర్దేశిత ప్రమాణాల్ని తప్పనిసరి చేయాల్సిన అవసరం నెలకొందన్నారు. నల్లానీటిని సురక్షితంగా తీర్చిదిద్దాలన్నారు. అసలు నల్లానీటి కోసం బీఐఎస్ రూపొందించిన ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాలకు సమానంగా లేవంటూ పాసవానే స్వయంగా పేర్కొన్న క్రమంలో ఇంతకన్నా మెరుగైన పరిస్థితుల్ని ఆశించగలమా!
దేశవ్యాప్త పరీక్షలు సాధ్యమేనా?
ప్రస్తుతం భారతదేశంలో బీఐఎస్ నాణ్యత ప్రమాణాలు, డబ్బాల్లో విక్రయించే తాగునీరు, 140 ఇతర ఉత్పత్తులకే తప్పనిసరి చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ ఉత్పత్తి, సేవకైనా ఈ ప్రామాణికాన్ని తప్పనిసరి చేసే అధికారం కేంద్రానికి ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రాల్లో ప్రజారోగ్య విభాగాలు, పురపాలక సంఘాలతో సమావేశాలు జరిపి, సురక్షిత తాగునీటి సరఫరాలో కీలకంగా నిలిచే నీటి పరీక్షలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను చర్చించేందుకు బీఐఎస్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. నేరుగా తాగేందుకు గంగా జలమూ పనికిరాదంటూ కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఇటీవల విస్పష్టంగా ప్రకటించింది. యమునా నది కాలుష్యం నియంత్రణ పరిధుల్ని దాటేసిందని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో... నల్లానీటిని బీఐఎస్ ప్రమాణాలతో సరఫరా చేస్తామనే ప్రకటన ఆచరణ సాధ్యమేనా అన్నది పెద్ద ప్రశ్న.
వాస్తవానికి 2024 నాటికి ప్రజలందరికీ సురక్షిత నల్లానీరు అందించాలనే లక్ష్యసాధనలో భాగంగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం- బీఐఎస్ ద్వారా దేశంలో సరఫరా అవుతున్న నల్లానీటి నాణ్యతను పరీక్షించాలని నిర్ణయించింది. ఆ నాణ్యత ఆధారంగా రాష్ట్రాలు, ఆకర్షణీయ నగరాలు, జిల్లాలకు ర్యాంకులు ఇవ్వాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల తాగునీటికి ఉద్దేశించిన ‘భారత ప్రమాణాలు 10500:2012’ మేరకు భౌతిక, రసాయన, విషపదార్థాల పరామితులతో నల్లానీటిని పరీక్షించగా, చాలా నమూనాలు విఫలమయ్యాయి. ముంబయిలో సేకరించి, పరీక్షించిన 10 నమూనాల్లో ఒక్కటీ విఫలం కాకపోవడంతో అది అత్యంత శుభ్రమైన నీటిని అందజేస్తున్న నగరంగా నిలిచింది. ఆ తరవాత స్థానంలో 10 నమూనాలకుగాను ఒకే వైఫల్యంతో హైదరాబాద్, భువనేశ్వర్ నిలిచాయి. అమరావతిలో పది నమూనాలకు ఆరు విఫలమయ్యాయి. దిల్లీ, చండీగఢ్, తిరువనంతపురం, పట్నా, భోపాల్, గువాహటి, బెంగళూరు, గాంధీనగర్, లఖ్‌నవూ, జమ్మూ, జయపుర, దెహ్రాదూన్, కోల్‌కతా నగరాల్లో నమూనాలన్నీ విఫలమయ్యాయి. తరవాతి దశలో ఈశాన్య రాష్ట్రాల రాజధానులు, ఆకర్షణీయ నగరాల్లో తాగునీటిని పరీక్షించి, 2020 జనవరి 15 నాటికి నివేదిక వెలువరించనున్నారు. ఆ తరవాత దేశంలోని జిల్లా కేంద్రాలన్నింటిలో నమూనాలు సేకరించి పరీక్షలు జరిపి, 2020 ఆగస్టు 15 నాటికి నివేదికలు విడుదల చేయాలనేది ప్రణాళిక.
భారత్‌లో పలు నగరాలు జలసంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. 256 జిల్లాల్లో నీటి కొరత వేధిస్తోంది. మరోవైపు 70 శాతం నీరు కలుషితమైంది. ఉపరితల నీటి వనరులు కాలుష్యం కోరల్లో చిక్కాయి. కొన్ని జల వనరులు ఎండిపోగా, మరికొన్ని చెత్తకుప్పల్లా మారాయి. నదుల పరిస్థితీ ఇంతకన్నా భిన్నంగా లేదు. ఈ వాస్తవాలు నీటి నిర్వహణలో మన తప్పటడుగులకు నిదర్శనంగా నిలుస్తూ, వెక్కిరిస్తున్నాయి. జలశాస్త్రానికి సంబంధించి మౌలికాంశాల్ని నిర్లక్ష్యం చేసిన ఫలితంగానే ఇలాంటి దుస్థితి నెలకొంది. దేశంలోని సుమారు 18 కోట్ల గ్రామీణ కుటుంబాలకుగాను, 3.3 కోట్ల కుటుంబాలకే నల్లానీటి సౌకర్యం ఉంది. 14.5 కోట్ల గడపలు ఆ సదుపాయానికి దూరంగా ఉన్నాయి. కోట్లమందికి శుభ్రమైన జలం అందుబాటులో లేదు. 2024 నాటికి ‘జలజీవన్ మిషన్(జేజేఎం)’ ద్వారా ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికీ కొళాయి ద్వారా సురక్షితమైన తాగునీటిని అందిస్తామంటూ గతంలోనే ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీ కఠినతర లక్ష్యాన్నే నిర్దేశించుకున్నారు. స్వచ్ఛభారత్‌లాగే జలజీవన్ మిషన్ కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని, ప్రజాకార్యమంటూ- జనభాగస్వామ్యాన్నీ ఆహ్వానించారు. ఈ మేరకు 2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి వ్యక్తికి, రోజూ 43 నుంచి 55 లీటర్ల నీటిని అందుబాటులోకి తీసుకురావాలనే దిశగా కేంద్రం యోచిస్తోంది. ఇందుకోసం రాబోయే సంవత్సరాల్లో రూ.3.5 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారు. దేశంలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు ‘స్వచ్ఛభారత్ కోశ్’ పేరిట నిధిని ఏర్పాటు చేసిన తీరులోనే ‘రాష్ట్రీయ జలజీవన్ కోశ్’నూ ఏర్పాటు చేయనున్నారు.
శుభ్రమైన నీటికోసం...
‘జలజీవన్ మిషన్’ విజయం సాధించాలంటే... శుభ్రత తప్పనిసరి అన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మాటలు ఇక్కడ ప్రస్తావనార్హం. జల వనరుల్లో కలిసే మురుగునీరు సక్రమరీతిలో శుద్ధి అయ్యేలా చర్యలు అవసరం. తాగునీటి అవసరాలకు భూగర్భ జలాలపైనే అధికంగా ఆధారపడకుండా నదులు, స్థానిక జలవనరుల్ని ఉపయోగించుకునే దిశగా, వాటికి పునరుజ్జీవనం కల్పించాలి. నీటి లభ్యతను పెంచేందుకు జల పరిరక్షణ, పునరుద్ధరణ, పునర్ వినియోగం ప్రక్రియల్ని అనుసరించడం అవసరం. వాననీటి సంరక్షించడం, సాగునీటిని సక్రమంగా వాడుకోవడంపై అవగాహన కల్పించడం అత్యంతావశ్యకం. ఇళ్లకి కొళాయి ద్వారా సరఫరా చేసే నీటి నాణ్యత, పరిమాణం పర్యవేక్షణకు డిజిటల్ సెన్సర్ల వినియోగం ప్రయోజనకరం. జలవనరుల పునరుద్ధరణ, పంపిణీ వంటి పనుల్ని స్థానిక స్థాయికి వికేంద్రీకరించాలి. కొళాయి నీటి నాణ్యతను పరీక్షించేందుకు గ్రామాల్లో మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు జేజేఎం, నైపుణ్య అభివృద్ధి మంత్రిత్వశాఖ కలిసికట్టుగా కృషిచేస్తే సత్ఫలితాలు ఉంటాయి. జలజీవన్ మిషన్ విషయంలో అనుకున్న లక్ష్యాలన్నీ నెరవేరితే మోదీ సర్కారు దేశంలో తాగునీటి విషయంలో ఓ విప్లవాన్నే ఆవిష్కరించే అవకాశం ఉందనడంలో సందేహం లేదు.
గుజరాత్ నేర్పుతున్న పాఠాలు
జలం విషయంలో ప్రధాని మోదీది ప్రత్యేకమైన ఆసక్తి. ఆయన నీటి అంశాన్ని ఒక విధాన సమస్యగా పరిగణించడం గురించి తెలుసుకోవాలంటే... 2002కు వెళ్లాలి. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తర గుజరాత్, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. రైళ్లు, ట్యాంకర్లలో నీటిని తెప్పించి సమస్యను ఎదుర్కొనేందుకు అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. పరిస్థితి నుంచి తాత్కాలికంగా బయటపడటం కాకుండా, పూర్తిస్థాయి పరిష్కారం కావాలని మోదీ అధికారులకు స్పష్టం చేశారు. ఆరేళ్ల వ్యవధిలో ఫలితాలు సాధించారు. 2008 నుంచి రాష్ట్రంలో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరగడం మొదలైంది. రాష్ట్రంలోని 80 శాతం కుటుంబాలకు కుళాయిల ద్వారా తాగునీరు అందించారు. వరద నీటిని కాలువల ద్వారా దక్షిణ గుజరాత్ నుంచి సౌరాష్ట్ర, నీటి కొరత ఉన్న ఇతర ప్రాంతాలకు తరలించారు. జలాశయాలను నింపారు. పొలాలకు నీరందించారు. భూగర్భ జలాలు పునరుత్తేజం పొందాయి. 2019లో వర్షాలు సమృద్ధిగా కురవగా, ఒకప్పడు పావువంతు సామర్థ్యంతో కూడా నిండని జలాశయాలు పూర్తిగా నిండాయి. అందరికీ ఆదర్శంగా నిలిచిన ‘గుజరాత్ వాటర్‌గ్రిడ్’ ఆ రాష్ట్రంలో 18,500 గ్రామాలకుగాను 14 వేల గ్రామాల ప్రజల గొంతు తడుపుతోంది.
నాణ్యత దిగనాసి
దశాబ్దం కిందట (2009 మే నెలలో) హైదరాబాద్‌లోని భోలక్‌పూర్‌లో కలుషిత కుళాయినీరు తాగి ఏడుగురు మృత్యువాత పడటం తెలిసిందే. తోలు పరిశ్రమల కాలుష్యం మంచినీటి పైపుల్లోకి ప్రవేశించడంతో ఆ ఉపద్రవం సంభవించినట్లు తేలింది. వేసవి కావడంతో ఎండల తీవ్రతకు నీటి కాలుష్యం గాఢత పెరిగి అతిసారం ప్రబలి రెండు రోజుల వ్యవధిలో ఏడుగురు మృతి చెందారు. వందలాది పేద ప్రజలు ఆస్పత్రులపాలయ్యారు. అప్పటికి కొన్ని రోజుల ముందునుంచే తాగునీరు కలుషితమవుతున్నట్లు స్థానికులు ఎన్నో ఫిర్యాదులు చేసినా, అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. దాంతో అమాయక ప్రజలు బలయ్యారు. ఆ ఉదంతం మన తాగునీటి ప్రమాణాల స్థాయిని, అధికార గణాల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేసింది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో మురుగునీరు కుళాయిల్లో కలవడం సర్వసాధారణ విషయమైపోయింది.
- శ్రీనివాస్ దరెగోని (రచయిత)
ఇదీ చూడండి: మరో ఏడాది గడిచే.. పౌర బాధ్యతకు ఏదీ మన్నన?