ఝార్ఖండ్ మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 3 గంటల వరకు కొనసాగనుంది. ఎన్నికల కోసం అధికారులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.
మొదటి దశలో 13 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇవాళ జరుగుతున్న పోలింగ్‌లో.. మొత్తం 189 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 37,83,055 మంది ఓటర్లు తేల్చనున్నారు.
ఎన్నికలు జరుగుతున్న స్థానాలివే..
మొదటి దశలో ఛత్రా, గుమ్లా, బిషున్పుర్, లోహర్దగా, మణికా, లతేహర్, పంకీ, డాల్టన్‌గంజ్, బిష్రాంపుర్, ఛతర్‌పుర్, హుస్సేనాబాద్, గర్వా, భవానాథ్పుర్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 15 మంది మహిళలతో సహా 189 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.
నువ్వా.. నేనా
ఈ 13 నియోజకవర్గాల్లో.. భాజపా 12 స్థానాల్లో బరిలో నిలిచింది. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. కూటమిగా ఏర్పడ్డ ప్రతిపక్షాలు ఝార్ఖండ్ ముక్తి మోర్చా 4, కాంగ్రెస్ 6, ఆర్జేడీ 3 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
ఝార్ఖండ్ వైద్యశాఖమంత్రి రామచంద్ర చంద్రవంశీ, కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రామేశ్వర్ ఓరాన్ సహా పలువురు ప్రముఖులు నేటి ఎన్నికల బరిలో ఉన్నారు.
ఐదు దశల్లో
81 అసెంబ్లీ స్థానాలున్న ఝార్ఖండ్‌లో మొత్తం ఐదు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ పోలింగ్ ఇవాళ జరుగుతోంది. డిసెంబర్ 7, 12, 16, 20 తేదీల్లో తదుపరి దశల ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.
ఇదీ చూడండి: గోవా 'సీఎం పీఠం'పై శివసేన కన్ను