జాతిపిత మహాత్మా గాంధీ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు విస్తృత ప్రచారం చేశారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. భావి తరాలకు గాంధీ సిద్ధాంతాలు తెలిసేలా రామోజీ గ్రూప్ కృషి చేసిందని కితాబిచ్చారు.
మహాత్ముడి మనసుకు దగ్గరైన 'వైష్ణవ జన తో' భజన గీతాన్ని మరోసారి రూపొందించడానికి ప్రముఖ కళాకారులను ఏకం చేసినందుకు ఈటీవీ భారత్‌ను ప్రశంసించారు మోదీ.
"గాంధేయవాదనను ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. గాంధేయ మార్గంలో ఎక్కడికైనా సులభంగా వెళ్లొచ్చు. రామోజీ రావుకు హృదయపూర్వక అభినందలు తెలియజేస్తున్నా. వారు చాలా పెద్దవారు. ఆయన మదిలో బలమైన కాంక్ష ఉండేది. నా వెంట పడుతుండేవారు. ప్రతిదీ ఎలా చేయాలి అని. మీరు చూసే ఉంటారు ఆయన ఈ దేశంలోని కళారంగానికి చెందిన ఎందరో మహానుభావులను ఏకం చేశారు. గాంధీజీకి ఇష్టమైన వైష్ణవ జనతో భజనకు కొంత ఆధునికతను జోడించి గీతం రూపొందించారు. ఇందులో గొప్ప సందేశం ఇచ్చారు."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.
మహాత్మాగాంధీ 150 జయంతిని పురస్కరించుకుని ఈటీవీ భారత్ రూపొందించిన 'వైష్ణవ జన తో' భజన గీతంతో పాటు.. రాజ్‌కుమార్ హిరానీ, తారక్ మెహతా గ్రూప్, కేంద్ర సాంస్కృతిక శాఖ రూపొందించిన వీడియోలను ప్రధాని శనివారం ఆవిష్కరించారు . దిల్లీలోని ఆయన నివాసం 7 లోక కళ్యాణ్ మార్గ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ, టీవీ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
15వ శతాబ్దానికి చెందిన గుజరాతీ కవి నర్సింగ్ మెహతా రచించిన వైష్ణవ జనతో భజనకు దేశంలోని ప్రముఖ గాయకులందరితో కొత్తరూపాన్ని కల్పించింది.. ఈటీవీ భారత్.. ! ప్రధాని తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ భజనను ఇంతకు ముందే 'రీ ట్వీట్' చేశారు.