అందమైన కట్టడాలతో పింక్ సిటీగా పేరుగాంచిన రాజస్థాన్ రాజధాని జైపుర్‌లో ఓ చిరుత హల్చల్ సృష్టిస్తోంది. అడవి నుంచి తప్పిపోయి నివాస ప్రాంతంలోకి చొరబడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. సుమారు 24 గంటలకుపైగా అటు ప్రజలకు, ఇటు అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దానిని పట్టుకునేందుకు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.
24 గంటలైనా..
గురువారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో తఖ్తేశాహి రోడ్‌లోని నివాస ప్రాంతంలో చిరుతను గుర్తించారు స్థానికులు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేపట్టారు. కానీ.. అది అక్కడి నుంచి ఆర్బీఐ కార్యాలయం మీదుగా సుబోధ్ కళాశాల ప్రాంతంలోకి వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాల్లో నమోదయింది. అధికారులు అక్కడికి చేరుకుని గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది.
ఆ చిరుత... సుబోధ్ కళాశాల నుంచి టోంక్ రోడ్ మీదగా ఎస్ఎంఎస్ మైదానం వైపు వెళ్లినట్లు భావిస్తున్నారు అధికారులు. ఈ ప్రాంతంలోనే రాజస్థాన్ హైకోర్టు, రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి.
సుబోధ్ కళాశాల వద్ద చివరి సారిగా దాని కదలికలను గుర్తించామని.. ప్రస్తుతం అసెంబ్లీ భవనం వెనుకాల ఉన్నట్లు సమాచారం వచ్చిందని అటవీశాఖ అధికారులు తెలిపారు.
ఎక్కడైనా చిరుత కనిపిస్తే సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు. చిరుతను వెంట పడి తరమటం, దానిపై దాడి చేయటం చేయకూడదని సూచించారు. అలా చేస్తే ఆ వన్యమృగం ఎదురుదాడి చేసే ప్రమాదముందని హెచ్చరించారు.
ఇదీ చూడండి: 'ప్లాస్టిక్‌పై వేటేద్దాం.. విస్తరాకుకే ఓటేద్దాం!'