జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై జరిగిన దాడి ఘటనను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. దేశాన్ని నియంత్రిస్తున్న నియంతృత్వవాదులకు.. విద్యార్థుల పట్ల ఉన్న భయాన్ని ఈ హింసాత్మక ఘటన ప్రతిబింబిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. వర్సిటీలో విద్యార్థుల భద్రతపై ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివారం జేఎన్‌యూ విశ్వవిద్యాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు.. ముఖాలకు మాస్కులు ధరించి.. విద్యార్థులపై దాడికి తెగబడ్డారు. విచక్షణారహితంగా కర్రలు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో 28 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎయిమ్స్‌కు తరలించారు.
మరోవైపు ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న 25మంది విద్యార్థులను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పరామర్శించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.
"ఇప్పుడు మోదీ-షాకు చెందిన గూండాలు విశ్వవిద్యాలయాల్లో హింసను సృష్టిస్తున్నారు. బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటున్న విద్యార్థులను భయపెడుతున్నారు. ఘటనతో సంబంధం లేదని భాజపా నేతల మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ప్రజలు అంతా చూస్తున్నారు. వారిని ఎవరూ మోసం చేయలేరు."
--- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.
ఘటనతో షాక్‌కు గురైనట్టు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. విద్యార్థులపై దారుణంగా దాడి జరిగిందని.. విశ్వవిద్యాలయంలో శాంతిని నెలకొల్పేందుకు పోలీసులు తగిన చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకే భద్రత లేకపోతే ఇక దేశం ఏలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు.
వర్సిటీలో చెలరేగిన హింసకు ఘటనకు ఏబీవీపీ కారణమని ఆరోపించారు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరీ. అధికారంలో ఉన్న వారు పక్కా ప్రణాళికతో దాడి జరిపించినట్టు అభిప్రాయపడ్డారు.
బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జేఎన్‌యూ పూర్వవిద్యార్థులైన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగమంత్రి జైశంకర్.. ఆదివారం జరిగిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అర్ధరాత్రి నిరసనలు...
మరోవైపు... జేఎన్‌యూ ఘటనతో విద్యార్థి లోకం భగ్గుమంది. విశ్వవిద్యాలయం బయట విద్యార్థులు బైఠాయించారు. తమకు న్యాయం జరగాలంటూ డిమాండ్ చేశారు. నినాదాలతో వర్సిటీ ప్రాంగణం హోరెత్తింది.
దిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయానికి నిరసన సెగ తాకింది. వందలాది మంది విద్యార్థులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దేశవ్యాప్తంగా...
ముంబయిలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు నిరసనలు చేపట్టారు. జేఎన్‌యూ ఘటనలో గాయపడిన వారికి సంఘీభావం తెలిపారు. కోల్‌కతాలోనూ ఇదే తరహా నిరసన చేపట్టారు విద్యార్థులు. పోస్టర్లతో నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులు కూడా జేఎన్‌యూ ఘటనపై ఆందోళన చేపట్టారు.