"హమ్ దిల్ దే చుకే సనమ్" బాలీవుడ్ సినిమా గుర్తుందా... అందులో సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ ప్రేమించుకుంటారు. కానీ ఐశ్వర్యరాయ్ తండ్రి ఆమెను అజయ్ దేవగణ్‌కు ఇచ్చి వివాహం జరిపిస్తాడు. పెళ్లి తర్వాత సల్మాన్-ఐశ్వర్యల ప్రేమ గురించి తెలుసుకున్న అజయ్ ఐశ్వర్యను సల్మాన్‌కు ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు. కానీ చివర్లో భర్త మనస్సు తెలుసుకున్న ఐశ్వర్య సల్మాన్‌తో పెళ్లికి నిరాకరించి అజయ్‌తోనే ఉండిపోతుంది. 1999లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్టయ్యింది. ఇప్పుడు ఆ సినిమా ప్రస్తావన ఎందుకంటారా....? సరిగ్గా ఆ సినిమా కథను పోలిన ఘటనే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది.
ఇదీ కథ...
భోపాల్‌కు చెందిన మహేష్ (పేరు మార్చాం)కు సంగీత (పేరు మార్చాం) అనే మహిళతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. మహేష్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, సంగీత ఫ్యాషన్ డిజైనర్. ప్రస్తుతం వీరిద్దరూ భోపాల్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశారు. ఇందుకు కారణం సంగీత తన మాజీ ప్రియుడ్ని వివాహం చేసుకోవాలనుకోవడమే.
పెళ్లికి ముందు సంగీత ఓ వ్యక్తిని ప్రేమించింది. కానీ ఆమె తండ్రి వారి ప్రేమను ఒప్పుకోలేదు. తర్వాత సంగీతను మహేష్‌కు ఇచ్చి వివాహం జరిపించాడు. కొద్ది సంవత్సరాల క్రితం సంగీతకు తన మాజీ ప్రియుడి గురించి తెలిసింది. ఆమె మీద ఉన్న ప్రేమతో అతను ఇప్పటి వరకు ఎవర్నీ వివాహం చేసుకోలేదని, ఆమెను తప్ప వేరే యువతిని పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడని తెలిసి సంగీత తిరిగి అతడ్ని వివాహం చేసుకోవాలనుకుంది.
ఇలా ముందుకు..
ఇందుకు మొదట ఆమె భర్త మహేష్ అంగీకరించలేదు. చివరకు ఆమె తన ప్రియుడితోనే ఉండాలని కోరుకుంటుందని తెలుసుకొని ఒప్పుకున్నాడు. ఇదే విషయాన్ని మహేష్ ఫ్యామిలీ కోర్టులో తెలియజేస్తూ విడాకులు ఇవ్వాలని కోరాడు. పిల్లల సంరక్షణ బాధ్యత మాత్రం తానే చూసుకుంటానని కోర్టుకు తెలియజేశాడు. ఇందుకు సంగీత కూడా అంగీకరించింది. ఆమెకు ఎప్పుడు పిల్లల్ని చూడాలని అనిపించినా వచ్చి చూడవచ్చని తెలిపాడు. ఇద్దరి అంగీకారం ఉన్నందున వారివురికి త్వరలోనే కోర్టు విడాకులు మంజూరు చేస్తుందని వారి న్యాయవాది తెలిపారు.