మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన నేతృత్వంలోని 'మహా వికాస్ అఘాడీ' ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే.. ఈ నెల 28న ప్రమాణం చేయనున్నారు. శివాజీ పార్క్ మైదానం ఈ ఘట్టానికి వేదిక కానుంది. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ కోరిక మేరకు ముందుగా అనుకున్న తేదీలో స్వల్ప మార్పు చేశారు.
అంతకుముందు ముంబయిలోని ట్రైడెంట్ హోటల్లో భేటీ అయిన మహావికాస్ అఘాడీ నేతలు.. తమ నాయకుడిగా ఉద్ధవ్ ఠాక్రేను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీఎం ప్రమాణస్వీకారోత్సవాన్ని డిసెంబరు 1న చేయాలని మొదటగా నిర్ణయించారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ కోశ్యారీని కలిశారు ఠాక్రే. కూటమి నేతలతో కలిసి వెళ్లిన ఆయన గవర్నర్‌తో రెండు గంటలపాటు చర్చించారు. అయితే ఈ నెల 28నే ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా ఠాక్రేను గవర్నర్ కోరారు. ఫలితంగా ప్రమాణ తేదీని మార్చారు శివసేన అధ్యక్షుడు.
ప్రతి ప్రశ్నకూ సమాధానమిస్తా...
ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటంపై ఉద్ధవ్ ఠాక్రే సంతోషం వ్యక్తం చేశారు. ఫడణవీస్ చేసిన ప్రతి ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఛత్రపతి శివాజీ కోరుకున్న మహారాష్ట్రను పునర్నిర్మిద్దామని పిలుపునిచ్చారు ఠాక్రే. తనకు సహకరించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
6 నెలల్లో ఎన్నికవ్వాలి...
ఉద్ధవ్ ఠాక్రే.. ప్రస్తుతం మహారాష్ట్ర శాసనసభలో సభ్యుడు కానందున, సీఎంగా ఎన్నికైన 6 నెలల్లోపు శాసన సభ్యత్వం పొందాల్సి ఉంటుంది.
సుప్రీం తీర్పుతో మారిన లెక్కలు...
ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్.. భాజపాను ఆహ్వానించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన సంయుక్తంగా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్‌ను ఆదేశించింది. తక్షణమే.. ప్రొటెం స్పీకర్‌ను నియమించి, ఈ ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేసింది.
అనంతరం.. మహా రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్ రాజీనామా చేయడం.. అనంతరం సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ వైదొలగడం, అధికారం కోల్పోవడం చకచకా జరిగిపోయాయి. కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన నేతృత్వంలోని 'మహా వికాస్ అఘాడీ' నేతలు గవర్నర్‌తో సమావేశమయ్యారు. తమకు 166 మంది ఎమ్మెల్యేల మద్దతుందని.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు. కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి.. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను ఈ నెల 28న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా కోరారు కోశ్యారీ. డిసెంబర్ 3వ తేదీలోగా మద్దతుదారుల జాబితాను సమర్పించాలంటూ ఠాక్రేకు.. గవర్నర్ లేఖ రాశారు.