'కళకు కాదేది అనర్హం' అని నిరూపించాడు కేరళ కన్నూర్‌కు చెందిన జిష్ణు అనే కళాకారుడు. సన్నటి పదునైన కత్తి చేతబట్టాడంటే.. క్షణాల్లో ఆకును అందమైన చిత్రంగా చెక్కేస్తాడు. మానవ ముఖం, ప్రకృతి అందాలు, జీవ వైవిధ్యాలు ఇలా ఏదైనా సరే.. జిష్టు తలుచుకుంటే పత్రిపై ఎంతో పొందికగా ఒదిగిపోతాయి.
లీఫ్ ఆర్ట్ ప్రత్యేకం...
చెట్ల ఆకులపై అద్భుత చిత్రాలు చెక్కుతూ తనలోని ప్రతిభను చాటుకుంటున్నాడు జిష్ణు. 'లీఫ్ ఆర్ట్'గా పిలిచే ఈ కళను పదో తరగతి నుంచే అలవరుచుకున్న జిష్ణు దానినే వృత్తిగా మార్చుకున్నాడు. ప్రముఖుల ముఖాలు, ప్రకృతి చిత్రాలను ఆకులపై తీర్చిదిద్దడంలో నైపుణ్యం సాధించాడు.
సహన శిల్పి..
ఎంతో సహనంతో పనిచేస్తే గానీ లీఫ్ ఆర్ట్‌లో రాణించలేరు. ఒక్క చిత్రాన్ని చెక్కాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. అందులో ఏదైనా పొరపాటు దొర్లితే.. ఆకు పాడై, మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తుంది.
ఎలా...
ముందుగా ఆకులను తెచ్చి, నీటిలో తడిపి వాటిని ఎండబెడతాడు. పొడి ఆకుపై స్కెచ్ పెన్‌తో తను చెక్కాలనుకున్న బొమ్మను గీస్తాడు. ఆ తర్వాత అవసరంలేని భాగాన్ని ఎంతో ఓపికతో చిన్న కత్తితో తీసేస్తాడు. ఇలా, చెక్కిన ఆకు శిల్పాలు చెక్కుచెదరకుండా భద్రపరుస్తాడు జిష్ణు.
ఈ కళను జిష్ణు ఎన్నో ఆకులపై ప్రయత్నించాడు. రావి, ఆర్చిడ్, మహాగొని,అడవి మల్లె వంటి ఎన్నో చెట్ల ఆకులపై చిత్రాలు చెక్కేస్తాడు. అయితే, పనస ఆకు మాత్రం తనకెంతో ఇష్టమంటాడు జిష్ణు.
ప్రస్తుతం లీఫ్ ఆర్ట్‌కి మంచి డిమాండ్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న జిష్ణు తన కళతో అందరి మన్ననలు పొందుతున్నాడు.