ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌కు ఇన్నర్‌లైన్ పర్మిట్(ఐఎల్పీ) విధానాన్ని వర్తింపజేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు(సీఏబీ)పై ఈశాన్య భారతంలో నిరసనలు చెలరేగుతున్న తరుణంలో రాష్ట్రపతి నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
సీఏబీపై ఈశాన్య రాష్ట్రాల ప్రజలకున్న భయాన్ని తొలగిస్తూ.. మణిపుర్‌కు ఇన్నర్‌లైన్ పర్మిట్‌ను వర్తింపజేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు రోజుల క్రితం లోక్‌సభ వేదికగా హామీనిచ్చారు. ఈ మేరకు నేడు రాష్ట్రపతి.. దస్త్రాలపై సంతకం చేశారు. సంబంధిత నోటిఫికేషన్‌ను హోంశాఖకు విడుదల చేసింది.
దిమాపుర్కూ...
నాగాలాండ్‌లోని దిమాపుర్ జిల్లాకు కూడా ఐఎల్పీని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. 1963లో నాగాలాండ్ రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటి నుంచి దిమాపుర్ జిల్లా ఒక్కటే ఐఎల్పీ పరిధిలో లేదు.
ఏంటీ ఐఎల్పీ?
ఐఎల్పీ విధానం ఉన్న రాష్ట్రాల్లో పర్యటించాలంటే విదేశీయులు సహా స్వదేశంలో ఉండే ప్రజలు కూడా అనుమతి తీసుకోవాల్సిందే. ఐఎల్పీతో అక్కడి స్థానికులకు భూమి, ఉద్యోగాలు ఇతర అంశాల్లో లబ్ధి, రక్షణ కలుగుతుంది. దేశంలోని ఇతర ప్రజలు ఈ ఐఎల్పీ రాష్ట్రాల్లో స్థిరపడకుండా చేసి, అక్కడి స్థానికులకు రక్షణ కల్పించడమే ఈ ఐఎల్పీ ముఖ్య ఉద్దేశం.
అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం తర్వాత.. ఈ ఐఎల్పీ విధానం అమల్లోకి వచ్చిన నాలుగో రాష్ట్రం మణిపుర్.
ఇదీ చూడండి:- అసోంలో పౌర బిల్లుకు వ్యతిరేకంగా మిన్నంటిన నిరసనలు