కర్తార్‌పుర్ నడవాకు సంబంధించి భారత్-పాక్‌ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. పంజాబ్ సరిహద్దు ప్రాంతం నరోవాల్ జిల్లాలోని జీరో పాయింట్ వద్ద గురువారం ఇరుదేశాల అధికారులు సమావేశమై ఒప్పందంపై సంతకాలు చేశారు. కేంద్రం తరఫున హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఎస్సీఎల్ దాస్ హాజరయ్యారు.
20 డాలర్లు కట్టాల్సిందే..
ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ప్రకారం యాత్రికులు ఉదయం వచ్చి గురుద్వారా దర్శన అనంతరం సాయంత్రం తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఎలాంటి వీసా లేకుండా ప్రతి రోజు 5వేల మందిని అనుమతిస్తారు. అయితే.. యాత్రికుల నుంచి 20 డాలర్లు వసూలు చేయాలని పాక్ నిర్ణయించింది. ఎలాంటి రుసుమును వసూలు చేయకూడదని భారత్ విజ్ఞప్తి చేసినప్పటికీ.. పాక్ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు.
" భారతీయ యాత్రికులు, భారత సంతతికి చెందిన వారు కార్తార్పుర్ కారిడార్‌ను వినియోగించుకోవచ్చు. ఈ యాత్రకు ఎలాంటి వీసా అవసరం లేదు. చెల్లుబాటులో ఉన్న పాస్‌పోర్ట్ తీసుకెళ్లాలి. కొన్ని అత్యవసర రోజులు మినహా.. కారిడార్ ఏడాది పాటు తెరిచి ఉంటుంది."
- ఎస్సీఎల్ దాస్, సంయుక్త కార్యదర్శి, హోంశాఖ.
నేటి నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్..
దర్బార్ సాహెబ్‌ను దర్శించుకోవాలనుకుంటున్న వారు నేటి నుంచి ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ పోర్టల్ (prakashpurb550.mha.gov.in)ను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఏ రోజు వెళ్లాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకోవచ్చు. ప్రయాణం చేయాల్సిన రోజుకు నాలుగు రోజుల ముందు రిజిస్ట్రేషన్ వివరాలు ఎస్ఎంఎస్, మేయిల్ ద్వారా అందుతాయి. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ పత్రం తీసుకోవాలి. పాస్‌పోర్ట్‌తో పాటు దీనిని తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ఒక్క రోజు ఆలస్యంగా..
కర్తార్పుర్పై భారత్-పాక్ మధ్య బుధవారం ఒప్పందం జరగాల్సి ఉంది. అయితే యాత్రికుల నుంచి 20 డాలర్లు వసూలు చేయాలన్న పాక్ నిర్ణయాన్ని పున:సమీక్షించాలని భారత్ కోరినందున ఒకరోజు ఆలస్యమైంది.
నవంబర్ 9న ప్రారంభం..
అంతర్జాతీయ సరిహద్దుకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజాబ్‌లోని డేరాబాబానానక్ గురుద్వారా నుంచి కర్తార్‌పుర్‌ను కలుపుతూ కారిడార్ నిర్మించారు. గురునానక్ 550వ జయంతి వేడుకలను పురస్కరించుకొని నవంబర్ 9న ఈ కారిడార్‌ను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రారంభించనున్నారు.
ఇదీ చూడండి: 60 సెకన్లలో భగత్‌సింగ్ చిత్రపటం గీసి రికార్డు