శోధన ఎలా మొదలైంది?
ఉమానంద ఆలయ ఘాట్ వద్ద ఓ టీకొట్టు ఉంది. సనూఅలీ అందులో పనిచేస్తాడు. శనివారం ఉదయం స్నానం చేస్తున్న సమయంలో అలీ కాలికి ఏదో పదునైన వస్తువు తగిలి రక్తం వచ్చింది. ఏంటబ్బా.. అని నీటిలోకి మునిగి చూస్తే అది లోహంతో చేసిన శివుడి విగ్రహం.
అంతకు కొద్ది రోజుల ముందు గుర్తుతెలియని వ్యక్తులు కొన్ని గోనె సంచులు తెచ్చి నదిలో విసరడాన్ని అలీ గమనించాడు. అవేంటి అని అడిగితే.. అందులో పనికి రాని సామాను ఉందని చెప్పారు. ఆ ప్రాంతంలోనే ఈ విగ్రహం తగిలేసరికి అది చోరీకి గురైన విగ్రహం అయి ఉంటుందని అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
పోలీసులు స్థానికుల సాయంతో విగ్రహం దొరికిన ప్రాంతంలో శోధన మొదలెట్టారు. మహాకాళి, శివుడు, రాముడు, రాధాకృష్టులు, తారా దేవి, బుద్ధుడు, వినాయకుడు, లక్ష్మీ విగ్రహాలను బయటకు తీశారు.
రాష్ట్ర విపత్తు స్పందన దళం(ఎస్డీఆర్ఎఫ్) రంగంలోకి దిగి మరో 29 విగ్రహాలను వెలికితీసింది. దీనితో ఈ విగ్రహాల వెనుక పెద్ద మర్మమే ఉందని భావించి దర్యాప్తు ముమ్మరం చేశారు అసోం పోలీసులు.
ఏం దొరికాయంటే?
ఇప్పటివరకు నదిలో నుంచి మొత్తం 42 ఆలయ సంబంధిత వస్తువులు బయటపడ్డాయి. అనేక దేవతా విగ్రహాలు.. లోహపు ప్రమిదలు.. దేవనాగరి లిపిలో చెక్కి ఉన్న రాతి ఫలకాలు, శంఖం, త్రిశూలం, దేవాలయ తలుపుల గడియలు, ఇతర ఆధ్యాత్మిక వస్తువులు బ్రహ్మపుత్ర నదిలో లభించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం ఆ విగ్రహాలు ఏ ఆలయానికి చెందినవి, ఇక్కడికి ఎలా వచ్చి చేరాయి, అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. గతంలో చోరీకి గురైన విగ్రహాల ఫిర్యాదులను పరిశీలిస్తున్నారు. వాటిలో ఏవైనా ఈ విగ్రహాలతో సంబంధం కలిగి ఉన్నాయా అని పోల్చి చూస్తున్నారు. ఇప్పుటికే ఈ దర్యాప్తులో రెండు వస్తువులు ఓ ఆలయానికి చెందినవిగా గుర్తించారు.
ఇదీ చదవండి:ఆడ తోడు కోసం రాష్ట్రాలు చుట్టొచ్చిన మగపులి