పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాల సందర్శన చేసేవారికి కేంద్రం తీపికబురు అందించింది. 'పర్యటన్ పర్వ్ పథకం' కింద ఏడాదిలో కనీసం 15 యాత్రాస్థలాలను సందర్శించేవారికి రివార్డులు అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర పర్యటకశాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ వెల్లడించారు. రివార్డు కింద పర్యటన ఖర్చులు అందజేయనున్నట్లు తెలిపారు.
ఫొటోలు ధ్రువీకరణ తప్పనిసరి...
అయితే యాత్రాస్థలాలను సందర్శించిన అనంతరం అక్కడి ఫొటోలను తమ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని మంత్రి సూచించారు. సొంత రాష్ట్రం కాకుండా, ఇతర రాష్ట్రాలలోని పర్యటక ప్రాంతాల సందర్శనకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపారు. దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే చర్యల్లో భాగంగా కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. 2022 నాటికి కనీసం 15 పర్యటనలు పూర్తి చేసుకున్న వారికి ఈ పథకం వర్తిస్తుందని అన్నారు.
కోణార్క్‌కు త్వరలోనే 'ఐకానిక్ సైట్' గుర్తింపు...
ఒడిశాలోని కోణార్క్‌లో నిర్వహించిన రెండు రోజుల జాతీయ పర్యటక ముగింపు కార్యక్రమంలో మంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. త్వరలోనే కోణార్క్ సూర్యదేవాలయానికి 'ఐకానిక్ సైట్స్' గుర్తింపు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
పర్యటక మార్గనిర్దేశకులుగా చేరేవారిలో ఒడిశా మెరుగవ్వాలని టూరిజమ్ అడిషినల్ డైరెక్టర్ జనరల్ రూపిందర్ బ్రార్ అన్నారు. దీనికోసం ఒడిశా ప్రభుత్వం ప్రత్యేకంగా సర్టిఫికెట్ ప్రోగ్రాంలను అందిస్తోందని రూపిందర్ తెలిపారు.
ఇదీ చదవండి: పాక్, బంగ్లా ముస్లింలను తరిమికొట్టాల్సిందే: శివసేన