ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల కొరత అనేది సర్వసాధారణంగా కనిపించే సమస్య. అందుబాటులో డబ్బులున్నా సక్రమంగా వాడుకోకపోవడాన్ని ఉదాసీనతగానే భావించాలి. 14 మంత్రిత్వ శాఖల ప్రమేయంతో ప్రధానమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకం ‘పోషణ అభియాన్’ను వేగంగా అమలు చేయాలని, కేటాయించిన నిధుల్ని సద్వినియోగం చేసుకోవాలంటూ ఇటీవల కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి(డబ్ల్యూసీడీ) మంత్రిత్వశాఖ రాష్ట్రాలను కోరిన నేపథ్యంలో ఇది చర్చనీయాంశంగా మారింది. పథకం నిర్దేశిత లక్ష్యాల సాధనలో రాష్ట్రాలు వెనకబడ్డాయంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆవేదన వ్యక్తీకరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
నామమాత్రంగానే అమలు
పశ్చిమ్ బంగ, హరియాణా, పంజాబ్, కేరళ, ఒడిశా, గోవా వంటి రాష్ట్రాల్లో పోషణ అభియాన్ పథకం అమలు నామమాత్రంగా ఉంది. కేంద్రం ఇప్పటిదాకా రూ.3,769 కోట్లు కేటాయించగా, రూ.1,058 కోట్లు (33 శాతం) మాత్రమే వాడుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పశ్చిమ బంగ, ఒడిశా, గోవాల్లో పథకం ప్రారంభానికే నోచుకోలేదు. కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల్లో ఒక శాతం నిధులనే ఉపయోగించారు. హరియాణా, కేరళల్లో అది పది శాతంకన్నా తక్కువగా ఉంది.
కేంద్రంతో ఉప్పూనిప్పులా వ్యవహరిస్తున్న పశ్చిమ్ బంగలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అసలు లెక్కలోకే తీసుకోలేదు. కేంద్ర పథకం కన్నా సమగ్రమైన ‘రాష్ట్ర పోషణ మిషన్’ను తాము అమలు చేస్తున్నామని ఆ రాష్ట్రమంత్రి శశిపంజా వివరణ ఇచ్చారు. భాజపా అధికారంలో ఉన్న గోవాలోనూ ఇదే పరిస్థితి ఉంది. తమకు రూ.432 కోట్లు అందజేసినా, అవసరమైన సిబ్బంది లేకపోవడం పథకం అమలులో వెనకబాటుకు కారణమన్న విడ్డూర వివరణను అక్కడి అధికారి దీపాలి నాయక్ వినిపించారు. పంజాబ్ పరిస్థితి కొంత మెరుగు. స్మార్ట్‌ఫోన్లు, ఉపకరణాల సేకరణలో ఆలస్యం, నిధుల విడుదలలో జాప్యం వంటి కారణాల వల్ల ఇప్పటికైతే నిధుల వినియోగం తక్కువ స్థాయిలోనే ఉందని ఆ రాష్ట్ర ఉన్నతాధికారి వివరించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే పథకం లక్ష్యసాధనలో వెనకబడక తప్పదని పలు సర్వేలు స్పష్టీకరిస్తున్నాయి. ఎదుగుదల లోపం, తక్కువ బరువు, పుట్టుకతో బరువు లోపం, మహిళలు, చిన్నారుల్లో రక్తహీనత వంటి అంశాల్లో మెరుగుదల కనిపించకపోతే, 2022 నాటికి పోషణ అభియాన్ కింద నిర్దేశించిన లక్ష్యాలను భారత్ అందుకోలేకపోవచ్చని అంతర్జాతీయ వైద్యపత్రిక ‘లాన్సెట్’ తాజా సర్వే కుండ బద్దలుకొట్టింది. భారత వైద్య పరిశోధన మండలి సైతం ఇవే అంచనాలను వినిపించింది.
2022 నాటికి పోషకాహార లోపం దూరం!
ఆరేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతల పోషకాహార పరిస్థితులపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావం చూపే పథకాలు దేశంలో పెద్ద సంఖ్యలోనే ఉన్నా, పోషకాహార సంబంధ సమస్యలు ఇప్పటికీ తీవ్రంగా వేధిస్తున్నాయి. దీంతో ఈ తరహా పథకాల మధ్య సమ్మిళితత్వ సాధనకు 2018లో పోషణ అభియాన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. బహుళ మంత్రిత్వ శాఖల్ని ఏకతాటిపై నడపాలని ఉద్దేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల సేవల్ని ఉపయోగించుకుంటూ, 2022 నాటికి భారత్‌లో పోషకాహార లోపాన్ని దూరం చేయాలనేది లక్ష్యం. ఈ పథకం కింద ఏటా ఎదుగుదల లోపాల్ని రెండు శాతం, ఎత్తుకు తగిన బరువు లేకపోవడాన్ని రెండు శాతం, చిన్నారులు, మహిళలు, కౌమార బాలికల్లో రక్తహీనతను మూడు శాతం, తక్కువ బరువు జననాల్ని రెండు శాతం మేర తగ్గించాలని నీతిఆయోగ్ రాష్ట్రాలకు లక్ష్యాలుగా నిర్దేశించింది.
డిజిటల్ సౌకర్యాలు
నీతిఆయోగ్ 27 ఆకాంక్షిత జిల్లాల్లో చేపట్టిన సర్వేలో 78 శాతం గర్భిణులు, పాలిచ్చే తల్లులు అంగన్‌వాడీల్లో నమోదు చేసుకోగా, కేవలం 46 శాతానికే పోషకాహారం అందుబాటులో ఉంది. ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద బాలింతలకు 25 రోజుల మేర ఆహార పదార్థాల్ని అందించాల్సి ఉండగా, అందులో సగం రోజులకే అవి అందుతున్నట్లు వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వం 2021 నాటికి అన్ని అంగన్‌వాడీలను డిజిటలీకరించాలని లక్ష్యంగా నిర్దేశించింది. పోషణ అభియాన్ అమలుకు సంబంధించిన వాస్తవిక స్థితి తెలుసుకునేందుకు స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. 26 రాష్ట్రాల్లో 285 జిల్లాల్లోని 4,84,901 అంగన్‌వాడీలకు మాత్రమే డిజిటల్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని, అక్కడ లబ్ధిదారుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో 14 లక్షల అంగన్‌వాడీలకుగాను, కేవలం 27.6 శాతమే స్మార్ట్‌ఫోన్లు కలిగి ఉండగా, 35 శాతం కేంద్రాలకు ఎత్తును కొలిచే, ఎదుగుదలను గణించే ఉపకరణాలు, బరువు తూచే యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. అంగన్‌వాడీల కోసం 6.28 లక్షల స్మార్ట్‌ఫోన్లు సేకరించారు. మరో 4.95 లక్షల సేకరణకు రంగం సిద్ధమైంది. పశ్చిమ్ బంగ, పంజాబ్, ఒడిశా ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్ల సేకరణ చేపట్టలేదు. స్మార్ట్‌ఫోన్ కార్యక్రమం కింద తల్లీబిడ్డల ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం నమోదు చేయడాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం లేదని, వాస్తవిక స్థితిలో నమోదయ్యే సమాచారం నిక్కచ్చితనాన్ని ఇంకా పరీక్షించ లేదని నీతిఆయోగ్ స్పష్టీకరించడం గమనార్హం. పోషణ అభియాన్‌లో 14 లక్షల మంది నకిలీ లబ్ధిదారులు ఉన్నట్లు కేంద్రం గుర్తించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు పట్టించుకోదగినవే. పలు మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాల అమలుకు సరిపడా సిబ్బంది లేరనేది నీతిఆయోగ్ ఆక్షేపణ. ప్రాజెక్టు అధికారులు, మహిళా సూపర్‌వైజర్ల ఖాళీలు 25 శాతందాకా ఉన్నాయి. మాతృవందన యోజన కింద రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో ఖాళీలు ఉన్నట్లు తేలింది. ఇన్ని లోపాలతో పథకం ముందుకు సాగేదెలా అనేది తరచి చూసుకోవాల్సిన అంశం. ఒకవైపు సమస్య తీవ్రత తెలుస్తున్నా, నిధుల వినియోగంలో నిర్లక్ష్యం గర్హనీయం. సమస్య తీవ్రతపై ప్రజల్లో అవగాహన పెంచాలి. తద్వారా పోషకాహార భద్రతను సుసాధ్యం చేసుకోవచ్చు. పోషణ అభియాన్ అమలులో వేగం పెంచితేనే నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంది. పోషకలేమితో బాధపడే రేపటి తరం సుదృఢ భారత్‌ను ఆవిష్కరించలేదన్న సంగతి విస్మరించరాదు!
-శ్రీనివాస్ దరెగోని