పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసోంలో హింసాత్మక ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో గువాహటి, డిబ్రూగడ్ నగరాలలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. బుధవారం సాయంత్రం 6:15 గంటలకు విధించిన కర్ఫ్యూను నిరవధికంగా పొడగించినట్లు అసోం అదనపు డైరెక్టర్ జనరల్ ముకేష్ అగర్వాల్ తెలిపారు. అయితే ఎప్పటివరకు కొనసాగుతుందనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. పరిస్థితులను బట్టి కర్ఫ్యూ ఎత్తివేతపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
డిబ్రూగడ్లో బుధవారం రాత్రి కర్ఫ్యూ విధించినట్లు డిప్యూటీ కమిషనర్ పల్లవ్ ఝా తెలిపారు. తర్వాతి ఆదేశాలు జారీ చేసే వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. అంతకుముందు కర్ఫ్యూ గురువారం ఉదయం 7 గంటల వరకు అమలులో ఉంటుందని అసోం పోలీస్ డైరెక్టర్ జనరల్ భాస్కర్ జ్యోతి మహంత వెల్లడించారు.
సైన్యం మోహరింపు
నిరసనలను అదుపుచేయడానికి నాలుగు జిల్లాల్లో సైన్యం మోహరించినట్లు లెఫ్టినెంట్ కల్నల్ పీ ఖోంగ్సాయి తెలిపారు. గువాహటిలో రెండు ఆర్మీ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీరందరూ నగరంలో కవాతు నిర్వహించినట్లు వెల్లడించారు. డిబ్రూగడ్, తినిసుకియా జిల్లాల్లోనూ సైన్యాన్ని మోహరించినట్లు అధికారులు తెలిపారు. జోర్హత్ ప్రాంతంలో ర్యాలీ నిర్వహిస్తోన్న సైన్యాన్ని రాత్రి వెనక్కి పిలిచినట్లు డిప్యూటీ కమిషనర్ రోష్నీ కొరాటీ వెల్లడించారు.
బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా అసోంలో ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి. వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసోం సెక్రటేరియేట్ ముందు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు, నిరసనకారులకు మధ్య ఘర్షణ ఏర్పడింది. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు.
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ దేశాల్లో మతపరమైన ఒత్తిడి ఎదుర్కొని భారత్కు వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం లభించేలా చట్టానికి కేంద్రం సవరణ చేసింది. ఈ బిల్లుకు పార్లమెంట్ బుధవారం ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా రూపాంతరం చెందనుంది.
ఇదీ చూడండి: 'పౌర' బిల్లుపై మోదీ హర్షం.. సోనియా ఫైర్