ప్రాణాంతక మహమ్మారి కరోనా ధాటికి.. చైనాలో 80 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది ఈ వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం ఈ వైరస్ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లోని రాజస్థాన్, బిహార్, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి.
బిహార్‌లో కరోనా లక్షణాలు..
బిహార్ ఛప్రాకు చెందిన 22 ఏళ్ల యువతి కరోనా లక్షణాలతో బాధ పడుతోంది. ఆమెకు ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇటీవలే ఆమె చైనా నుంచి స్వగ్రామానికి చేరుకుందని.. కరోనా అనుమానంతో ప్రత్యేకంగా వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. అయితే.. ఇప్పటి వరకు ఎలాంటి వైరస్ నిర్ధరణ కాలేదని తెలిపారు. మరోవైపు.. బిహార్‌కు వచ్చే పర్యటకులను క్షుణ్నంగా పరిశీలించిన తరువాతే రాష్ట్రంలోకి అనుమతించాలని ఆ ఆ రాష్ట్ర ఆరోగ్య విభాగం విమానాశ్రయ అధికారులను ఆదేశించింది.
రాజస్థాన్‌లోనూ..
రాజస్థాన్‌లో ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు వైద్యులు. చైనాలో ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసుకుని భారత్‌కు తిరిగివచ్చిన అతని రక్తపు నమూనాను పరీక్షించేందుకు పూణె జాతీయ వైరాలజీ ల్యాబ్‌కు తరలించాలని.. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ సూచించారు. ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసిన వైద్యం అందించాలని ఆదేశించారు. కరోనా అనుమానితులను పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని కేంద్రాన్ని కోరారు.
కోల్‌కతాలో..
పశ్చిమ బంగ రాజధాని కోల్‌కతాలోని బెల్లఘట్ట ఐడీ ఆస్పత్రిలో ఓ యువతి కరోనా లక్షణాలతో చేరింది. కోల్‌కతా పర్యటనకు వచ్చిన ఆ యువతి చైనీస్ భాషలో మాట్లాడుతున్న క్రమంలో ఆమె చైనా నుంచి వచ్చినట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆమెను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
గోవా ముందు జాగ్రత్తలు..
పర్యాటక ప్రాంతమైన గోవాలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ప్రత్యేక టాక్స్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఒక్క కేసు నిర్ధరణ కాలేదు..
కొద్ది రోజుల క్రితం ముంబయిలో ఇద్దరు వ్యక్తులు ఇలానే కరోనా వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు.. కానీ, వారి శరీరంలో కరోనా లేదని తేలింది. ప్రస్తుతం వారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు.
ఇప్పటి వరకు భారత్‌లో కరోనా వైరస్ కనిపించలేదు.. అయితే.. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా చైనా సహా ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చేవారిలో ఈ వైరస్ లేదని నిర్ధరించాకే.. వారిని దేశంలోకి అనుమతిస్తున్నారు అధికారులు.
ఇదీ చదవండి:ఆ చిన్నారి జ్ఞాపక శక్తికి అవార్డులు దాసోహం.. ఏడేళ్లకే డాక్టరేట్