కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఐఎన్‌ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
షరతులతో...
రూ. 2 లక్షల సొంతపూచీకత్తు, అదే మొత్తంతో మరో ఇద్దరి పూచీకత్తు సమర్పించాలని చిదంబరాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని షరతులు విధించింది. సాక్షులతో ఎలాంటి సంప్రదింపులు జరపకూడదని, కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడరాదని ఆజ్ఞాపించింది.
మొదలైందిలా
చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉండగా ఐఎన్‌ఎక్స్ మీడియాకు విదేశీ పెట్టుబడుల అనుమతులు మంజూరులో అక్రమాలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ఆగస్టు 21న సీబీఐ చిదంబరాన్ని అరెస్టు చేసింది. అదే వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందన్న అభియోగాలపై అక్టోబర్ 16న ఈడీ ఆయన్ను అదుపులోకి తీసుకుంది.
మొత్తంగా 105 రోజుల పాటు చిదంబరం తిహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఐఎన్‌ఎక్స్ మీడియా మనీల్యాండరింగ్ సీబీఐ కేసులో చిదంబారానికి ఇప్పటికే బెయిల్ లభించింది.
కాంగ్రెస్ హర్షం
చిదంబరానికి బెయిల్ మంజూరుపై సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించింది కాంగ్రెస్ పార్టీ. ఆఖరున సత్యమే గెలిచిందని వ్యాఖ్యానించింది. ఎంతో ముందుగానే సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉండిందని సీనియర్ కాంగ్రెస్ నేత శశిథరూర్ వ్యాఖ్యానించారు.