సాధారణ జనం పగలైనా ఒంటరిగా వెళ్లేందుకు ఆలోచించే శ్మశానంలో రాత్రంతా నిద్రిస్తున్నాడు ఆ వ్యక్తి. తానొక్కడే కాదు.. తండ్రి ప్రేమను పక్కనపెట్టి ఏడేళ్ల వయస్సున్న కుమారుడిని తనతోనే పడుకోబెట్టుకుంటున్నాడు. ఈ కఠిన తండ్రి హృదయం వెనక ఉన్న కన్నీటి గాథ వింటే గుండె చెరువు అవుతుంది.
మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా కుడారి నివాసి రామ్ రతన్. 2012లో పిల్లాడికి జన్మనిస్తూ భార్య అసువులు బాసింది. పనికి వెళ్తే రోజు కూలీగా వచ్చే రూ. 50 మాత్రమే జీవనాధారంగా ఇన్నాళ్లు కాలం వెల్లదీశారు.
ఇటీవల కురిసిన వర్షాలకు ఇప్పటివరకు తలదాచుకున్న ఇళ్లు నేలమట్టమయింది. ఆశ్రయం కల్పించే దిక్కులేక.. శ్మశానంలో కాపురముంటున్నాడు రామ్. ఈ తండ్రీకొడుకులు ఇద్దరికీ ఎవరైనా పిలిచి పెడితేనే భోజనం. లేదంటే ఆ రోజు అంతే సంగతి!
ఇంత కష్టంలో ఉన్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయమూ అందలేదు. ఏదైనా పథకాన్ని వర్తింపజేయాలంటే అవసరమైన గుర్తింపు పత్రాలు వీరివద్ద లేవు.
ఈ కుటుంబ పరిస్థితి ఇప్పటివరకు తమ దృష్టికి రాలేదని అధికారులు చెప్పారు. ఇప్పుడీ వార్త బయటకు రాగానే రామ్ రతన్‌కు చేయూత అందించేందుకు ప్రభుత్వ అధికారులు ముందుకు వస్తున్నారు.
ఇదీ చూడండి: హరిత వెలుగులు తెచ్చే టపాసులు చూశారా..?