చైనా సహా ప్రపంచంలోని పలు దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ భారత్‌లో కూడా విస్తరించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వివిధ విభాగాలతో సమీక్ష నిర్వహించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై దిశా నిర్దేశం చేశారు. చైనా సహా వివిధ దేశాల నుంచి వచ్చిన వారి సందేహాల నివృత్తికి 24 గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్ విమానాశ్రయాలకు వివిధ వైద్య నిపుణులతో కూడిన కేంద్ర బృందాలను పంపాలని సూచించారు.
కరోనా వైరస్ సోకిందని భావిస్తున్న నేపాల్‌తో.. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సరిహద్దు ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌తో హర్షవర్ధన్ మాట్లాడారు. అన్ని విధాలా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. కరోనా నివారణ చర్యలపై వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రులకు లేఖ రాయనున్నట్లు హర్షవర్ధన్ తెలిపారు.
వైద్య పరీక్షలకు ఆదేశం
జనవరి 1 తర్వాత చైనా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయులు తమకు కరోనా లక్షణాలు కనిపిస్తే సమీపంలోని వైద్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. చైనా నుంచి కేరళకు వచ్చిన ఏడుగురు భారతీయులను పరిశీలనలో ఉంచినట్లు ఆయన తెలిపారు. వారి శరీరం నుంచి సేకరించిన నమూనాలను పుణెలోని ఐసీఎంఆర్ పరీక్షా కేంద్రానికి పంపినట్లు వెల్లడించారు. మరో నలుగురికి పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ సోకలేదని తేలినట్లు హర్షవర్ధన్ స్పష్టం చేశారు.
రెండో ఆసుపత్రికి చైనా నిర్ణయం
కరోనావైరస్ వేగంగా విస్తరిస్తున్న కారణంగా వైరస్ బారినపడిన వారికోసం రెండో ఆస్పత్రిని నిర్మించాలని చైనా నిర్ణయించింది. పదిరోజుల్లో వెయ్యి పడకల ఆసుపత్రిని నిర్మించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించింది డ్రాగన్ దేశం. వుహాన్‌లో మరో 13 వందల పడకల ఆసుపత్రిని 15 రోజుల్లో నిర్మించాలని అధికారులను ఆదేశించింది.
హాంకాంగ్‌లో అత్యవసర స్థితి
హాంకాంగ్‌లో ఇప్పటికే ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా అత్యవసర స్థితిని ప్రకటించింది అక్కడి ప్రభుత్వం.
ఇదీ చూడండి: 'కరోనా'పై చైనాను పొగడ్తలతో ముంచెత్తిన ట్రంప్