ETV Bharat / politics

ఆరోజు జగన్​ ఇంట్లో సమావేశం- అవినాష్​ ఫోన్లో ఏం మాట్లాడారు! వెలుగులోకి సంచలన విషయాలు - viveka murder case

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 9:04 PM IST

Updated : Apr 30, 2024, 10:31 PM IST

viveka_murder_case_live_demo
viveka_murder_case_live_demo

viveka murder demo : వైఎస్​ వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు పరిణామాలు, తదనంతరం దర్యాప్తుతో వెలుగులోకి వచ్చిన అంశాలపై సునీత ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సంచలనం సృష్టిస్తోంది. హత్య జరిగిన రోజు ఉదయం 5 సమయంలో జగన్‌ ఇంట్లో భేటీ జరిగిందని సునీత చెప్పారు. ఉ.6.27 గం.కు అవినాష్‌ రెడ్డి వివేకా ఇంటి ప్రాంగణంలో ఉన్నారంటూ సీసీ ఫుటేజీని బయటపెట్టింది.

YS viveka murder pp presentation: వైఎస్‌ వారసుడు జగన్‌ కాదని వైఎస్ వివేకా కుమార్తె సునీత పునరుద్ఘాటించారు. పులివెందుల ప్రజల్లో భయం నెలకొందని, మునుపటి స్వేచ్ఛ రావాలంటే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. వివేక హత్య చేసిన ఇంట్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఆ రోజు పరిణామాలు, ఆ తర్వాత దర్యాప్తుతో వెలుగులోకి వచ్చిన వివరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్​ ఇచ్చారు. తాను చెబుతున్నావని దర్యాప్తు వివరాలకు దగ్గరగా ఉన్నవే అని సునీత వెల్లడించింది. హత్య జరిగిన రోజు ఉదయం 5 సమయంలో జగన్‌ ఇంట్లో భేటీ జరిగిందని సునీత చెప్పారు. దీనిపై సీబీఐ ఎందుకు ఇంకా దర్యాప్తు పూర్తి చేయలేదో తెలియట్లేదన్నారు. హత్య జరిగిన రోజు వివేకా ఇంటి వద్ద నుంచి అవినాష్‌ రెడ్డి ఫోన్‌లో మాట్లాడిన ఫొటోను సునీత బయటపెట్టారు. ఆరోజు ఎవరితో ఆయన మాట్లాడారో కాల్‌ డేటా వివరాలను వెల్లడించారు. తన తండ్రి హత్య జరిగిన రోజు నిందితులు ఏవిధంగా లోపలికి వచ్చి బయటకు వెళ్లారో సునీత మీడియాకు వివరించారు. బెడ్‌రూమ్‌, బాత్‌రూమ్‌లో హత్య జరిగిన ప్రదేశాన్ని చూపించారు. సునీత చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే..

కొంగుచాచిన తోబుట్టువులకు ఏం చెప్తావ్ జగన్? - Sisters fire on CM Jagan

'మాజీ సీఎస్‌ అజేయ కల్లం సీబీఐకి స్టేట్‌మెంట్ ఇవ్వలేదని కేసు పెట్టారు కానీ, కేసుకు సంబంధించి కోర్టులో సీబీఐ ఆడియో రికార్డింగ్‌ సమర్పించింది. ఉదయం 5 గంటల సమయంలో జగన్‌ ఇంట్లో భేటీ జరిగిందని చెప్పారు. తర్వాత అరగంటకే ఉదయం 5.30 సమయంలో భారతి పిలుస్తున్నారని జగన్‌ అటెండెంట్‌ చెప్పడంతో జగన్​ వెళ్లిపోయారు. భారతి వద్దకు వెళ్లి వచ్చాక చిన్నాన్న చనిపోయినట్లు జగన్‌ సమావేశంలో చెప్పారు. కానీ, ఎందుకు ఇంకా దర్యాప్తు పూర్తి చేయలేదో తెలియట్లేదు. వాస్తవానికి అవినాష్‌ రెడ్డికి అదే రోజు ఉ.6.26 గంటలకు కు ఫోన్‌ వచ్చింది. ఉ.6.27 గం.కు అవినాష్‌ రెడ్డి వివేకా ఇంటి బయటకు వెళ్లి ఫోన్‌ మాట్లాడారు. అవినాష్‌ రెడ్డి ఇంటికి వచ్చినప్పుడు దాదాపు 10-15 మంది ఉన్నారు. కానీ, తాను వచ్చేసరికి 50-100 మంది ఉన్నట్లు అవినాష్‌ పోలీసులకు చెప్పారు. ఉ.6.32 గం.కు భారతి సహాయకుడు నవీన్‌తో అవినాష్‌ మాట్లాడారు. ఆ ఆరు నిమిషాలపాటు ఏం మాట్లాడుకున్నారో తెలియట్లేదు. ఓఎస్‌డీ కృష్ణమోహన్‌, శివప్రకాశ్‌ రెడ్డితో కూడా అవినాష్‌ రెడ్డి మాట్లాడారు. ఉదయం 7 నుంచి 8 ప్రాంతంలో హత్య స్థలం క్లీన్‌ చేశారు. అయితే, అంత సేపు ఫోన్‌లో మాట్లాడిన తర్వాత సాక్షిలో గుండెపోటు అని ఎలా వచ్చింది? ఫిర్యాదు ఇచ్చిన తర్వాత చేసిన ఫోన్‌కాల్స్‌లో ఏం మాట్లాడారు? మరుసటి రోజు ఏ ఆధారాలతో నారాసుర రక్త చరిత్ర అని రాశారు? మళ్లీ ఇప్పడు మాత్రం నేను, మా వాళ్లు హత్య చేశామని ప్రచారం చేస్తున్నారు. ఘటన తర్వాత వారిని కానీ, మమ్మల్ని కానీ ఎందుకు అరెస్టు చేయలేదు? మేము ఇద్దరం కాకుండా మరెవరో అయితే ఎందుకు అరెస్టు చేయలేదు?' అని సునీత ప్రశ్నించారు.

వివేకా హత్య వెనకుంది అతడే- ప్రజా తీర్పు కోసమే సాక్ష్యాలు చూపిస్తున్నా: సునీతా - YS Sunitha About Viveka Murder Case

హత్య విచారణకు 2019 మార్చి 15న ఏడీజీపీ నేతృత్వంలో సిట్‌ ఏర్పాటు చేశారని సునీత తెలిపారు. '2019 జూన్‌ 13న ఎస్పీ అభిషేక్‌ నేతృత్వంలో రెండో సిట్‌ ఏర్పాటు చేశారు. 2019 అక్టోబర్‌ 16న ఎస్పీ అన్బురాజన్‌ నేతృత్వంలో మూడో సిట్‌ ఏర్పాటు. తొలి సారి ఏర్పాటు చేసిన సిట్‌ విచారణతో ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేశారు. ఒకరిని అరెస్టు చేశారు. రెండో సిట్‌ సమయంలో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయలేదు. ఇదిలా ఉంటే నిందితుల్లో ఒకరైన శ్రీనివాస్‌ రెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. శనగ గుళికలు తీసుకుని శ్రీనివాస్‌ రెడ్డి చనిపోయినట్లు చెప్పారు. సీఎం, భాస్కర్‌రెడ్డి, శివప్రకాశ్‌ రెడ్డికి శ్రీనివాస్‌ రెడ్డి లేఖ రాశారు. తన చావుకు ఇన్‌స్పెక్టర్‌ శ్రీరామ్‌ కారణమని లేఖలో శ్రీనివాస్‌ రెడ్డి రాశారు. కానీ, శ్రీనివాస్‌ రెడ్డి రాసిన రెండు లేఖల్లో చేతిరాత వేర్వేరుగా ఉంది. వివేకా హత్య కేసును ఇన్‌స్పెక్టర్‌ శ్రీరామ్‌ దర్యాప్తు చేశారు. శ్రీనివాస్‌ రెడ్డి ఆత్మహత్య లేఖలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిస్తే వేర్వేరు రాతలుగా గుర్తించి నివేదిక ఇచ్చారు. శ్రీనివాస్‌రెడ్డి పోస్టుమార్టంలో లివర్‌, కిడ్నీకి మధ్య రక్తం గుర్తించారు. శనగ గుళికలు తీసుకుని చనిపోతే లివర్‌ వద్ద రక్తం ఎలా ఉంటుంది. శ్రీనివాస్‌ రెడ్డి మృతి కేసు దర్యాప్తు పూర్తిగా పక్కన పడింది. అనుమానాస్పద మృతి అయినా కారణం ఎవరనేది ఇప్పటికీ తెలియదు. ఘటన తర్వాత కొంతకాలానికి మళ్లీ దర్యాప్తు బృందం మారింది. సీబీఐ దర్యాప్తు అక్కర్లేదని 2020 ఫిబ్రవరిలో జగన్‌ హైకోర్టులో మెమో దాఖలు చేశారు. జగన్‌కు నైతిక బాధ్యత ఉందని కోర్టు చెప్పింది. చంపింది ఎవరో త్వరగా కనుక్కోవాలని సూచించింది. దర్యాప్తునకు ఢోకా లేదని కోర్టును నమ్మించే ప్రయత్నం చేశారు. హత్యకు సంబంధించి పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదని కోర్టు చెప్పింది. 2021 నవంబర్‌లో శివశంకర్‌ రెడ్డి అరెస్టు జరిగింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులే హత్య చేసినట్లు ఆరోపణలు చేసినా ఒక్కరినీ పట్టుకోలేదు. నేను సీబీఐని ఆశ్రయించకముందు నేరస్థులను ఎందుకు పట్టుకోలేదు. ఇప్పుడేమో మేము నేరం చేశామని చెబుతున్నారు. శివశంకర్‌, అవినాష్‌కు సంబంధం ఉందని మీరు ఒప్పుకుంటున్నారా? శంకర్‌ తర్వాత అవినాష్‌ అరెస్టు అవుతారని స్పష్టం చేయాలనుకుంటున్నారా?' అని సునీత నిలదీశారు.

గంగిరెడ్డి ఆధారాలు తుడుస్తుంటే అవినాష్ చూస్తూ నిలబడ్డారు - రవీంద్రనాథ్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు - MLA Ravindranath on Viveka Case

2021 నవంబర్‌లో భరత్‌ యాదవ్‌ అనే వ్యక్తి సీబీఐకి లేఖ రాశారని సునీత వెల్లడించారు. 'నా భర్త నర్రెడ్డి రాజశేఖర్‌ రెడ్డి హత్య చేయించారని గంగాధర్‌ రెడ్డి నాపై ఆరోపణలు చేస్తూ 2021 నవంబర్‌లో అనంతపురం ఎస్పీకి గంగాధర్‌ రెడ్డి లేఖ రాశారు. సీబీఐ అధికారులపై తప్పుడు కేసులు పెట్టడం మొదలు పెట్టారు. రాంసింగ్‌పై ఉదయ్‌కుమార్‌ పెట్టిన కేసుపై హైకోర్టు స్టే విధించింది. మీరు పెట్టిన కేసులపై స్టే విధించినా కౌంటర్‌ దాఖలు చేయలేదు. శంకర్‌ అరెస్టు తర్వాత అవినాష్‌ అరెస్టవుతారని అలా చేశారా?, దర్యాప్తు అధికారిని మార్పించారు.. ఇద్దరిని అరెస్టు చేశారు. కీలక కేసులో సాక్షిగా ఉన్న భరత్‌ యాదవ్‌కు గన్‌ లైసెన్స్‌ ఇస్తారా? భరత్‌ వంటివారిని ప్రోత్సహించి ఎన్ని హత్యలు చేయించాలని చూస్తున్నారు? కర్నూలులో అవినాష్‌ అరెస్టు డ్రామా జరిగింది. తొలుత శంకరయ్యను సస్పెండ్‌ చేశారు.. తిరిగి తీసుకున్నారు. తిరిగి తీసుకోకముందు 164 కింద వాంగ్మూలం ఇస్తానని శంకరయ్య చెప్పారు. ఉద్యోగంలోకి తీసుకున్నాక శంకరయ్య వాంగ్మూలం ఇవ్వలేదు. దస్తగిరిని ప్రభావితం చేసేందుకు యత్నించారు.. కేసులు పెట్టారు' అని సునీత వెల్లడించారు.

జగన్ బంధుత్వాలకు అర్థం తెలుసా? చంపిన వాళ్లు నీ పక్కనే ఉన్నారు- వైఎస్ సునీత - ys viveka murder case

ఆరోజు జగన్​ ఇంట్లో సమావేశం- అవినాశ్​ ఫోన్లో ఏం మాట్లాడారు! వెలుగులోకి సంచలన విషయాలు
Last Updated :Apr 30, 2024, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.