DSP Chaitanya Behind Tadipatri Violence: తాడిపత్రిలో కొనసాగుతున్న వైఎస్సార్సీపీ ప్రేరేపిత దాడులు, ఘర్షణలను అదుపు చేసేందుకంటూ ఆ పార్టీ అరాచకాలకు కొమ్ముకాసే డీఎస్పీ వీఎన్కే చైతన్యను పంపించటం వివాదాస్పదమవుతోంది. ప్రస్తుతం రాజంపేట డీఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న చైతన్య, గతంలో దాదాపు రెండున్నరేళ్లపాటు తాడిపత్రి డీఎస్పీగా పనిచేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పిందే చట్టమన్నట్టుగా వైఎస్సార్సీపీ కార్యకర్తలా వ్యవహరించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా భౌతిక దాడులకు దిగారు. వారిపై అక్రమ కేసులు బనాయించారు. ఆలాంటి అధికారిని తాడిపత్రికి పంపించడంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పట్ల మరోసారి వీరభక్తి చాటుకున్నారు.
మంగళవారం పోలీసులు భాష్పాయువు ప్రయోగించడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి అస్వస్థతకు గురై హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే అదునుగా చూసుకుని డీఎస్పీ చైతన్య తన బృందంతో కలిసి తాడిపత్రిలోని జేసీ నివాసంలోకి మంగళవారం అర్ధరాత్రి చొరబడ్డారు. అక్కడి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి టీడీపీ కార్యకర్తల్ని లాఠీలతో విచక్షణారహితంగా కొట్టారు. ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో పనిచేసే దళితుడు, దివ్యాంగుడైన కిరణ్‌కుమార్‌ను ఇష్టానుసారం కొట్టారు! దాదాపు 35 మందిని అదుపులోకి తీసుకుని ఎక్కడికో తరలించారు.
తాడిపత్రిని ప్రశాంతంగా ఉంచేందుకు తాము ప్రయత్నిస్తుంటే, డీఎస్పీ చైతన్య హింసను ప్రేరేపించడంపై ఎస్పీ అమిత్ బర్దర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ ఇంట్లో పనిమనుషులు, కంప్యూటర్ ఆపరేటర్‌పై దాడులు చేయడమేంటని గట్టిగా నిలదీశారు. తక్షణమే తాడిపత్రి వదిలి, తిరిగి రాజంపేటకు వెళ్లిపోవాలని చైతన్యను ఎస్పీ ఆదేశించారు. ఆ తర్వాత చైతన్య బుధవారం సాయంత్రం అనంతపురం నుంచి నేరుగా రాజంపేట వెళ్లిపోయారు. ఐతే అసలు చైతన్యని తాడిపత్రికి ఎవరు పిలిపించారంటే తనకు తెలియదని అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ చెప్తున్నారు. ఇంతకంటే దారుణ వైఫల్యం ఏముంటుంది?
చైతన్య రాజంపేటను వదిలి, తాడిపత్రి వెళితే అనంతపురం, అన్నమయ్య జిల్లాల ఎస్పీలకు, అనంతపురం రేంజ్ డీఐజీకి తెలియదా? కనీసం డీజీపీకి, శాంతిభద్రతల విభాగం అదనపు డీజీకీ తెలియదా? నిఘా విభాగాధిపతి దృష్టికీ రాలేదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వారంతా ఏం చేస్తున్నారు? ఘర్షణలకు మరింత ఆజ్యం పోసే అధికారిని అక్కడికి పంపిందెవరో సమగ్రంగా విచారించాల్సి ఉందినే డిమాండ్లు వినిపిస్తున్నాయి. నిజంగానే ఎవరి ఆదేశాలు లేకుండానే చైతన్య తాడిపత్రి వెళ్లి దాడి చేసుంటే సస్పెండ్ చేయాలి, లేదంటే సర్వీసు నుంచి డిస్మిస్ చేయాలని ఒత్తిడి పెరుగుతోంది. అలాకాకుండా ఎవరైనా ఆదేశమిచ్చి తాడిపత్రికి పంపిస్తే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలనే వాదనలు వినిపిస్తున్నాయి.
పోలీసులంతా కలిసి కొట్టారు: జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుడు కిరణ్ - POLICE ATTACK ON JC FOLLOWER
ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై ఉన్న భక్తితో కళ్లు మూసుకుపోయిన చైతన్య తీరు ముందు నుంచీ వివాదాస్పదమే. పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి 2022 జూన్ 11న ఎస్సీ సామాజికవర్గానికి చెందిన టీడీపీ కౌన్సిలర్ కొత్తపల్లి మల్లికార్జునపై దాడి చేస్తే కేసు పెట్టొద్దంటూ స్టేషన్‌కు పిలిచి బాధితుడినే కొట్టిన చరిత్ర చైతన్యది. ఆ తర్వాత మల్లికార్జున ప్రైవేటు కేసు వేశారు. అలా ఒకట్రెండు కాదు, చైతన్యపై ఏకంగా 23 ప్రైవేటు కేసులు వేశారు. ఇవన్నీ ప్రస్తుతం విచారణలో ఉన్నాయి.
రణరంగంగా తాడిపత్రి - రహస్య ప్రాంతానికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి తరలింపు - High Tension In Tadipatri