High BP Diet Food : పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో మార్పులు మనిషి ఆరోగ్యంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తాయి. వేగంగా మారుతున్న జీవనవిధానం, దానికి తగ్గట్టుగా ఉండేందుకు ఎదుర్కొంటున్న సవాళ్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా బీపీ, షుగర్, గుండె సంబంధిత సమస్యలు ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా హైపర్ టెన్షన్(హై బీపీ)తో బాధపడుతున్న వ్యక్తులు పోషకాహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హై బీపీకి వైద్యుల సూచన మేరకు కొన్ని మందులు వాడుతున్నప్పటికీ, వాటితో పాటు ఆహారంలో మార్పులు చేయాల్సిన అవసరం చాలా ఉంది. బీపీ ఎక్కువైతే పూర్తి ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా దీని ప్రభావం మూత్రపిండాలపై పడుతుంది. అధిక రక్తపోటుతో తలనొప్పి, తలతిరగడం, దృష్టిలోపం లాంటి సమస్యలు కూడా వస్తుంటాయి. కొన్నిసార్లు హైబీపీ కారణంగా ముక్కు నుంచి రక్తస్రావం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి బీపీని ఎల్లప్పుడూ కంట్రోల్లో ఉంచుకోవాల్సి ఉంటుంది. హై బీపీ నియంత్రణలో ఉండేందుకు ఉపయోగపడే ఆహార పదార్థాలేంటో చూద్దాం.
ఆకుకూరలు
పండ్లు, కూరగాయలు, ఆకుకూరల్లో తృణధాన్యాలు, చిక్కుళ్లలలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. రక్తపోటు సమస్యను తగ్గించడంలో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యాన్ని బాగా ప్రోత్సహిస్తాయి. వీటిలో కేవలం హైపర్ టెన్షన్‌ను నియంత్రణలో పెట్టే లక్షణాలతో పాటు శరీరంలోని ఇతర అవయవాల పనితీరును మెరుగుపరిచేందుకు అవసరమయ్యే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటివి కూడా పుష్కలంగా లభిస్తాయి.
స్ట్రాబెర్రీలు
రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలనుకుంటే బెర్రీ పండ్లు మంచి పదార్థంగా చెప్పచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉండే స్ట్రాబెర్రీలు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
అరటిపండ్లు
అనేక పోషకాలతో నిండిన అరటిపండ్లు రక్తపోటును తగ్గించడంలో కూడా బాగా సహాయపడతాయి. పొటాషియంకు పవర్ హౌజ్‌గా పనిచేసే అరటిపండ్లు శరీరంలో సోడియం స్థాయిలను నియంత్రించి ఆరోగ్యకరమైన రక్తపోటుకు దోహదపడతాయి.
వోట్మీల్
ఫైబర్ అధికంగా ఉండే వోట్మీల్ కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. దీన్ని తినడం వల్ల రక్తపోటును ఎప్పుడూ నియంత్రణలో ఉంచుతుంది.
బీట్ రూట్
రక్తాన్ని పెంచడంలో బీట్ రూట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎక్కువ మందికి తెలియని విషయం ఏంటంటే ఇందులో ఉండే అధిక నైట్రేట్ కంటెంట్ రక్తపోటును తగ్గించడంలోనూ సహాయపడుతుంది.
ఉప్పు వాడకం తగ్గించాలి
రక్తపోటుకు ప్రధాన కారణం సోడియం. ఇది హైపర్ టెన్షన్ సమస్యను తీవ్రతరం చేస్తుంది. కాబట్టి వీలైనంత వరకూ సోడియం లేని ఆహారాలు అంటే ప్రాసెస్ చేయని ఆహర పదార్థాలను ఎంచుకోండి. మీరు తీసుకునే ఆహారాల్లో ఉప్పు వాడకాన్ని తగ్గించండి. బయట లభించే ప్యాక్ చేసిన ఫుడ్స్, రెస్టారెంట్ ఫుడ్స్‌లలో సోడియం ఎక్కువగా ఉంటుంది. వీటిని దూరంగా ఉంచండి.
లీన్ ప్రొటీన్లను ఎంచుకోండి
ఎర్రటి మాంసం వినియోగం తగ్గించి దానికి బదులుగా చేపలు, పౌట్ట్రీ పదార్థాలు, చిక్కుల్లు, టోఫు వంటి లీన్ ప్రొటీన్ కలిగిన ఆహారాలను ఎంచుకోండి. ముఖ్యంగా సాల్మన్ వంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేపలు హైపర్ టెన్షన్ సమస్యను తగ్గించడంలో బాగా సహాయపడతాయి.
ఆరోగ్యకరమైన కొవ్వులు
ఆలివ్ ఆయిల్, అవకాడోలు, గింజలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఆహార పదార్థాలు అధిక రక్తపోటుకు దూరంగా ఉంచుతాయి.
మద్యం
మద్యం అలవాటు ఉన్నవారు ఎంత దూరంగా ఉంటే అధిక రక్తపోటు అంత దూరంగా ఉండచ్చు. మహిళలు ఒకవంతు, పురుషులు రెండు వంతుల మద్యం మాత్రమే తీసుకోవాలి. అంతకుమించి మద్యం తాగితే బీపీ సమస్య పెరుగుతుంది.
చక్కెర వినియోగం
అధిక చక్కెర కారణంగా బరువు పెగరడం, ఇతర గుండె సంబంధిత రోగాలకు కూడా కారణమవుతుంది. చక్కెరకు బదులుగా తేనె వంటి సహజ స్వీటెనర్లను ఎంచుకోవడం, డెజర్టులను కూడా మితంగా తీసుకోవటం చేయాలి.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఒక్క చెంచా తేనెతో ఎంతో మేలు- సమ్మర్లో హనీ ఎందుకు తీసుకోవాలో తెలుసా? - Honey Usage In Summer